Wednesday, October 7, 2020

 బాట మధ్యన కంచెలు

అయ్యా ..
ఘోరం జరిగిపోనాది బాబయ్యా
రెల్లు గడ్డిని దున్నపోతులు
గడ్డికొయ్యబోయిన మా బొట్టిని
సీంబోతులంసుంటి మీ ఇంటెద్దులు
తొక్కేసి... కుమ్మేసి
నేలమట్టం చేసేసినాయి సామీ
పోయింది మానమే అయితే
ఉడుకుడుకు ఉప్పేసిన గుడ్డమూటతో
కాపండం పెట్టుకుని
పల్లకుండే మాటే దొరా
బిడ్డ పానమే పాయే
పెంటపోగులో నాటుకోడి అనుకున్నారేమో
పుటుక్కున ఇరిసేసినారుగదా మెడకాయ
కింద నెప్పనిపించిందో
పైన గుట్కా కంపు చీదరగొట్టిందో
వదల్రా నా బట్టా అని అదిలిచ్చిందేమో
నాలిక చీరి ఎండేశారుగదా అయ్యా
అమ్మా... ఓ అమ్మా
బిడ్డ సచ్చిపోనాదండీ
గుడ్డలేకుండా నడి మాగాట్లో
పంగలు ఇచ్చుకుని
దశమి తెల్లారి పార్నూకిన
దుర్గమ్మ ఇగ్రహం...
అయ్యో... అయ్యయ్యో...
వారం దినాల కిందటి ముచ్చటేగదా సామీ
ముట్టైన చిన్న దొరసాని
బరాల్గన్ మింగి మునగడదీసుకుంటే
గంపకెత్తుకున్న ఎర్రటి పచ్చి గుడ్డల్ని
గంగలో జాడిచ్చి నా బిడ్డ మీ ఇంటికి చేర్చింది
ఇంతలోనే ఎట్టా నిగిడి మాటేసిందయ్యా
నీ ఇంట్లో పెరుగుతున్న నూగుమీసం
ఎదిగొచ్చిన కూతురయ్యా...
బతకనిస్తేనన్నా ముందుకు
మీకే ఏ పరగడుపునో పలారమై
మా జేజి లెక్కన మాయమ్మ లెక్కన
నాలెక్కన నా అప్పజెళ్ళెల్ల లెక్కన
ఈడనే బతుకు ఎల్లబుచ్చేది కాదా అయ్యా
ఏడ్చీ ఏడ్చీ
గిత్త గిత్త పేరూ తలసకుంటా
కుమ్ము కుమ్ముకూ మూలుక్కుంటా
తలుసుకుని తలుసుకుని
గుండెలు అవిసీ నాలిక ఎండీ
బిడ్డ దమ్ము వదినేసినాదండీ
సచ్చిన పీనిగ అని
కనికరం కూడా ల్యాపాయే
అద్దరేత్రికాడ అడ్డదారిన ఈడ్సకపోయి
అయిపు ల్యాకోకుండా అగ్గిలో నూకారే
అదేందయ్యా అని అడగబోయిన మడిసిని
అరికాలెత్తి గుండెల్లో తన్నారే
బా బిడ్డ గాలిముండ అని ఒకడు
అలవాటైన నంజకూతురు అనేది ఉంకోడు
గవుర్నమెంటు ఇచ్చే పెంటకోసం
ఆశపడి బిడ్డను సంపుకున్న
పందుల కుటంబ నాది అనేవోడు మరొకడు
యావైనా సరే... మా కోడెదూడల శేర్లు
నికార్సైనవే అంటా రంకెలు పెట్టేది కుడా మీరే
దెంగిచ్చుకోమరిగిన కోళ్ళు ఇళ్ళముందుకు వచ్చి
గొంతులు లేపితే తెగ్గోస్తామని
సవాళ్ళు ఇసిరేవోళ్ళూ మీరే
మానభంగం మా జన్మహక్కనీ
మా బారోటి అంగాల్లోనే కాదు
ముర్రు మా వొళ్ళంతా సెగలు కక్కుతా
పారతానే ఉంటదని
ప్యాపర్లలో ప్రెకటన చేసే
సన్యాసి ముక్కెమంత్రి మీవోడే
ఇయ్యాలేదో కొత్తగా అయినట్టు
కొంపలేవో ఇప్పుడే మునిగినట్టు
కూతుళ్ళెవురో తొలిసారి కర్సైపోయినట్టు
వగలాడి ఏడుపులు ఏడ్చారంటే
రేపుట్నుండి బతుకు
రేగిన పుండే అవుతుందని బెదిరిచ్చే
అధికారులూ మీతోటే
మీరే పోలీస్
మీదే ఠానా
మీ పెరట్లోనే కోర్టు
మీ పాయఖానానే కచేరి
నేలా మీదే లెక్కా మీదే లాఠీ మీదే
అది ఇరిగే యీపు మాత్రమే నాది
అబ్బా... చూడూ...
నిన్నటిదాకా సమసమాజం
లింగ వివక్ష కులవివక్షా
ఫాసిజం కమీషనిజం అంటా
దగ్గొచ్చేదాకా పొగ రేగ్గొట్టిన జనాలు
ఇయ్యాల పొద్దు పొడిచేతలికి
ఎట్టా చేతులు కలిపేసుకుని
మా దార్లో కంచె కట్టేశారో...
చెయ్యిపట్టుకుని ఇప్లవ బీజాక్షరాలు దిద్దిస్తాం అని
నమ్మబలికిన మడుసులు
సూడూ... ఎట్టా మా నోళ్ళకు తాళాలేస్తన్నారో
మా ఏడుపునూ ఎగతాళిచేసే పనిలో
మా గోలకు యాకరణం నేర్పే పనిలో
మా చేతగాని తనంలో గెలుపును ఎతుక్కుంటా
సూడూ.... ఎట్టా ఇరగబడి నవ్వుతున్నారో
పగలబడి వుమ్ముతున్నారో....
అయ్యా.... సంపేత్తే సంపేసేరు సామీ...
కానీ రేపుటినుండి మళ్ళీ
భారత దేశం నా మాతృభూమి
భారతీయులందరూ నా సహోదరులు
అని పలకకపోతే
మీ సంగీతమో సాహిత్యమో
పీఠమో పీతాంబరమో
మాకు నచ్చలేదూ అంటే మాత్రం
ఒంటికాలిమీద లేచి మా ముకాలమీద
ఒంటేలు పొయ్యబాకండి తల్లా
ఇన్ని రకాలుగా మోసం చెయ్యబడినాక
ఇన్నేసి సార్లు మీ ఐకమత్యానికి
బలైపోవటం అలవాటయ్యాక
ఇంత బాహాటంగా మీ వేషాలు బయటపడ్డాక
మిమ్ముల్ని అనుమానించకుండా
మీతో విడిపోయి బతకకుండా
మీ దారిలోనే నడవాలంటే
మీ పాటకు తలలు వూపాలంటే
మీ మాటల్ని కళ్ళకు అద్దుకోవాలంటే
మీతో మాటవరసకైనా ఏకీభవించాలంటే
సచ్చే సావు మాకు సామీ!

  బాట మధ్యన కంచెలు --------------- https://www.facebook.com/indusmartin/ అయ్యా .. ఘోరం జరిగిపోనాది బాబయ్యా రెల్లు గడ్డిని దున్నపోతులు గడ్డి...